Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

4. భారతీయ సమైక్యతా మూర్తి - ఆదిశంకరులు

వైదిక విజ్ఞానాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో సమగ్రంగా ఆవిష్కరించారు. సమన్వయం సాధించారు. ఋషులందరికీ ఈ సమన్వయభావం ఉండింది. అయితే కలి గడుస్తున్న కొలదీ ఋషివాటికలు అదృశ్యమయిపోయాయి. సాంఖ్యాది వైదిక దర్శనములు, చార్వాకాది నాస్తిక దర్శనములు, తమది హైందవ ధర్మమని చెబుతూనే వేదమునంగీకరించని తాంత్రిక మార్గములు, ఆగమము ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా అభివృద్ధి చెందిపోయాయి. వేద ప్రమాణాన్ని అంగీకరించని వారు కొందరు, పరమేశ్వరాస్తిత్వాన్ని సరుకు చేయనివారు మరి కొందరు. శంకర విజయములన్నీ శంకరావిర్భావమునకు ముందు దేశం ధార్మికంగా క్షీణదశను పొంది ఉన్నదని వివరిస్తున్నాయి. శంకరుల ముందున్న డెబ్బయిరెండు దుర్మతములలో ఎన్నో మతముల పేర్లే ఈ రోజుకు మనకు తెలియక పోయినా హైందవ సమాజము వైదికావైదికములైన అనేక మతములతో కొట్టుమిట్టాడుతుండేదనేది నిర్వివాదాంశము.

బుద్దునికి పుట్టిన ప్రశ్నలు వైదిక మతమునకు క్రొత్తేమీ కాదు. ఉపనిషత్తులలో చర్చించబడనివి కావు. అయినా బుద్దుడు ప్రశ్నించినప్పుడు అప్పటి పండితులెవ్వరూ బదులు చెప్పకపావడానికి కారణం ఏమిటి? కంచిమహాస్వామివారు ఇది అప్పటి బ్రహ్మణ్యపు క్షీణదశను సూచిస్తోందంటారు. బుద్దుడు తన శైలిలో సత్యాన్వేషణ ఆరంభించారు. ఆయనది శుద్ద ఆధ్యాత్మికత. యావత్‌ సమాజమునకు ఆయన మార్గదర్శకత్వము చేయగలిగారని చెప్పడానికి వీలు లేదు. అయితే వారి వ్యక్తిగతమైన ఔన్నత్యము కారణంగా అనేకమంది ఆకర్షితులయ్యారు.

బౌద్దం వ్యాప్తి చెందటానికి అనేక కారణాలున్నాయి. రాజాశ్రయం, కర్మకాండ లేకపోవడం, వర్ణాశ్రమ ధర్మాలేవీ లేకపోవడం వంటివి. పిల్లలను ప్రొద్దునే లేపి స్నానం చేయించడం వంటివి చేసే వారిపైన వారికి విసుగ్గానే ఉంటుంది. ఏ కట్టుబాట్లు లేకుండా పెంచేవారంటేనే వారికి ఇష్టంగా ఉంటుంది. సాధారణ ప్రజలు బుద్ధునిలో కనిపించే శాంతికీ, కట్టుబాట్లు లేని జీవితానికి ఆకర్షితులైతే, మేధావులు ఏ ప్రమాణానికి కట్టుబడని శుద్దతర్కం ప్రతిష్టించబడే శూన్యవాదం, విజ్ఞాన వాదములకు ప్రభావితులైనారు. క్రైస్తవమునకు ఎంతో ముందుగానే బౌద్దము-సంఘములు, ఆరామములు, విహారములు అంటూ ఏర్పాటుచేసి బౌద్ద భిక్షులు, భిక్షకుల ద్వారా మతప్రచారం చేపట్టింది.

విశేషమేమంటే బౌద్దం భిక్షు ధర్మాలను గురించి చెప్పిందే కానీ, సాధారణ జీవన విధానం గురించి చర్చించలేదు. ప్రజలు బౌద్దము యెడ సానుభూతి చూపినా హిందూ వ్యవస్థ మారలేదు. అయితే ప్రజలలో వేదముల మీద విశ్వాసము సడలిపోవడానికి, కట్టుబాట్లు ఎదిరించడానికి బౌద్ధము ప్రోది చేసింది. వేదవాక్కులు ఆగమ వాక్కులకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు పరమేశ్వరుని చేత స్వయంగా చెప్పబడినవి కాబట్టి ఆగమవాక్కులే ప్రమాణమని చెప్పగలిగే సాహసాన్ని చేకూర్చింది.

ఇక షడ్దర్శనములున్నాయి. సాంఖ్యయోగము, న్యాయవైశేషికములు, పూర్వోత్తరమీమాంసలు. సాంఖ్య దర్శనము, పరమేశ్వరాస్తిత్వాన్ని ఒప్పుకోకపోవడంతో శంకరులకు ఎంతో ముందుగానే అంతర్ధానమయిపోయింది. అయిననూ అందులోని వాదనలను మనువు నుండి శంకరుల వరకూ అందరూ ఉపయోగించుకొన్నారు. అలాగే యోగము బుద్ధునితో సహా అందరిచేతనూ ఉపయోగించుకోబడింది. అయితే మౌలికమైన వాదనలతో సాంఖ్యాన్ని పోలియండటం చేత యోగము వైదికులచే నిరాకరించబడింది.

న్యాయవైశేషికములు బౌద్దమును సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. ప్రపంచము, బ్రహ్మ రెండూ సత్యములే ననెడి ద్వైతవాదము ఈ నైయాయికులది. ప్రపంచము బ్రహ్మము రెండునూ లేవనుట బ్రహ్మము. ప్రపంచము సత్యము, బ్రహ్మము లేదనుట చార్వాకము. బ్రహ్మము మాత్రమే సత్యము - ప్రపంచము మిథ్యయనునది వేదాంతము. కేవల తర్కబలముతో న్యాయదర్శనము చేత ప్రతిష్టించబడిన పరమేశ్వరాస్తిత్వము వేదాభిమతము కాదు.

పూర్వమీమాంసా శాస్త్రమున్నది. వీరు వైదిక కర్మల కిచ్చిన ప్రాధాన్యత ఎంతడిదంటే ఈశ్వరాస్థిత్వాన్నే సరుకు చేయలేదు. వేద ప్రమాణ్యవాదముతో బౌద్ధాన్ని మాత్రం తీవ్రంగా ఎదుర్కోగలిగారు. అయితే కర్మమోక్షానికి అవసరమైన చిత్తశుద్దిని ప్రసాదిస్తుంది కానీ, నేరుగా మోక్షాన్ని ప్రసాదించే శక్తి గలది కాదని వీరు అర్థం చేసుకోలేకపోయారు. బాదరాయణుని వేదాంత సూత్రములు (ఉత్తర మీమాంస) పైనను ఉపనిషత్తులపైననూ అనేక భాష్యములు శంకరుల ముందు కాలంలోనే ఉన్నాయని తెలుస్తోంది. శంకరులే కొంతమంది అట్టి భాష్యకారులను ఉటంకించారు. అయితే వాటి స్వరూప స్వభావము ఎటువంటివి, అవి సమగ్రమైనవా కాదా అన్న విషయం పరిశీలించడానికి ఇప్పుడు ఆ భాష్యములు అందుబాటులో లేవు. వేదాంత దర్శనమంటే మొదటి నుండి అద్వైత సిద్దాంతమే తప్పితే వేరొకటి కాదన్నది మాత్రము స్పష్టం.

భారతీయ సంస్కృతి భక్తితో పెనవేసుకొని యున్నది. దానిపైన ఆధారపడి పురాణములు మొదలుగాగల అనంతమైన వాఙ్మయము పుట్టింది. భగవానుడు మోక్షమునకు భక్తి అతిసులువైన మార్గమని కొనియాడాడు కదా. దురదృష్టవశాత్తు సాంఖ్యాది దర్శనములు మేధావులైన వారి వాదనాపటిమను ప్రదర్శించడానికి వేదికలుగా మారాయి కానీ సామాన్యమానవుని అవసరాలను గురించి పట్టించుకోలేదు. పరిణతి చెందనివాని విషయంలో వేదాంతము కూడా మెట్టవేదాంతంగా పరిణమిస్తుంది.

మరి సామాన్యప్రజలు తాంత్రిక, కాపాలికాది వివిధ మార్గములను ఆశ్రయించారు. వైదిక సంబంధమున్నవే అయినా కాలక్రమేణా తమ మార్గములు వేదముపైకాక, తమ ఆగమములపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ రకంగా బౌద్దము, చార్వాకము మొదలుగాగల అవైదిక మతములు, వేదమును ప్రమాణంగా స్వీకరిస్తూనే వేద హృదయాన్ని పూర్తిగా ఆవిష్కరించలేనివి, సమన్వయము సాధించలేనివీ అయిన దర్శనములు వెఱ్ఱితలలు వేసి వింత ఆచారములు ప్రబలి పోయిన దుర్మతములతో హైందవధర్మానికి గ్రహణం.

వేదముల పరమార్ధము మోక్షము, జీవన్ముక్తత్వము, ఆత్మానుసంధాన మన్నది స్పష్టము. దర్శనములు పరస్పర విరుద్ధములు కాదు. వేదాంత దర్శనములలో చెప్పబడిన పరబ్రహ్మానుసంధానమునకు ఇవన్నీ పోషకములు. దర్శనముల మూల పురుషులు పరమాదరపాత్రులైన మహర్షులన్నది అందరూ ఎఱిగినదే. అయితే కాలం గడిచిన కొలది ఆయా మార్గావలంబకుల ఆలోచనా సరళిలో సంక్రమించిన తీవ్రతను పరిహరించి గతి నిర్ధేశనం చేస్తే అది మోక్షమార్గమే అవుతుంది. అలాగే వివిధ ఉపాసకామార్గములు బ్రహ్మానుసంధానమునకు ఉద్దేశించినవే. మధ్యకాలంలో గమ్యం మరచి, చేర్చబడిన వక్రతలను తొలగిస్తే అవి మోక్షపథములే. శంకరులు ఏ దర్శనమునూ, ఉపాసకామార్గమునూ పూర్తిగా తోసివేయలేదు. అన్ని మార్గములలోని పరమార్ధము బ్రహ్మానుసంధానమేనన్నది నిరూపించారు. శంకరుల ముందున్న వేదాంత దర్శనాచార్యులలో కూడా ఔత్తరాహికులైన ఆచార్యుల సిద్దాంతములకు, దాక్షిణాత్యులైన ఆచార్యుల సిద్దాంతములకు వ్యత్యాసము ఉండెడిదనీ, దానిని కూడా శంకరులు సమన్వయపరిచారని విమర్శకులు చెబుతారు.

బుద్దుడు మొదలుగాగల మహాపురుషులు మోక్షాన్ని పొందటానికై తరతరములుగా వస్తున్న సంప్రదాయమును సమర్దవంతము కాదని భావించారు. పూర్తిగా సంప్రదాయాన్నే త్రోసిపుచ్చారు. తలనొప్పి భరింపరానిదిగా ఉన్నదని శిరచ్ఛేదనం చేసుకొంటామా? మిగతా సంస్కర్తలకూ, ఆదిశంకరులకూ ఉన్న వ్యత్యాసం ఇదే. వారు సంప్రదాయాన్ని కూలదోయడానికి ప్రయత్నించరు. ఆ చెడు ధోరణుల మూలం తెలుసుకొని నిరోధించడానికి ప్రయత్నిస్తారు. సంప్రదాయానికి వారిచ్చిన గౌరవము మహత్తరమైనది. 'అసంప్రదాయవిత్‌ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయః' అన్నది వారి అనుశాసనము.

భగవత్పాదులవారు సమాజంలో ప్రతి ఒక్కరికీ వారి వారి కవసరమైన మార్గమును నిర్దేశించారు. వేదాంత దర్శనాన్ని సుప్రతిష్టితం చేసి ఊరుకోలేదు. వైదికమైన మంత్ర, తంత్ర, యోగశాస్త్రములపైన అనేక మెలుకువలతో కూడిన గ్రంథములు వ్రాశారు. ప్రచారం చేశారు. వేలాది దేవీ దేవతా మూర్తులను ఆరు వర్గాలుగా విభజించి అప్పటికే ఉన్న పంచాయతన విధానాన్ని పునరుద్ధరించి షణ్మత స్థాపనను చేశారు. మరింత సామాన్యప్రజానీకంలో భక్తి ప్రచోదనం చేయడం కోసం ముమ్మారు దేశమంతటా విజయయాత్ర చేసి ముఖ్యమైన దేవాలయాలన్నిటినీ దర్శించి, స్తోత్రములు చేసి, అవాంఛనీయమైన ఆచారములను తొలగించి పూజా పద్దతులను పరిపుష్టం చేశారు. ఈ దేశం మారుమూలల్లో ఉన్న ఆలయాలలో కూడా ఒక యంత్రమో, ఆచారమో ఆచార్యులవారి చేత ఏర్పాటు చేయబడిందని చెప్పుకోవడం ఈనాటికీ మనం చూస్తునే ఉన్నాము.

భగవత్పాదులవారు భారతీయ సమైక్యతామూర్తి. వారి గురువులు నర్మదా తీరమునకు చెందినవారయితే శిష్యులను దేశపు నలుమూలల నుండి స్వీకరించారు. దేశంలో పలుచోట్ల పీఠస్థాపనం చేశారు. బదరీనాధ్‌లో నంబూద్రి బ్రాహ్మణులను, నేపాళంలో కర్ణాటకులను అర్చకులుగా నియమించడం వంటి ఆచారాలు వారి సమైక్యతా ధృక్పధానికి ఉదాహరణలు. దక్షిణ భారతంలో కంచిలోనూ, తిరువత్తియూరులోనూ, జంబుకేశ్వరంలోనూ శంకరుల సన్నిధి ఉన్నప్పటికీ ప్రత్యేకమైన ఆలయాలు ఉత్తరాదినే ఉన్నట్లు తోస్తోంది. శంకరుల కంటూ ప్రత్యేకమైన దేవాలయములు ఉత్తరాదిన కాశ్మీరులో ఉండటం విశేషం. ఈ మధ్య గుజరాత్‌లో క్రీ.శ. 500 నాటికి శంకర భగవత్పాదుల దేవాలయమునకు చేసిన ఒక దానశాసనం వెలువడింది. (జులై 31, 2001 భావన్స్‌ జోర్నల్‌).

నదులన్నీ సాగరాన్ని చేరినట్లు శంకరుల ముందున్న వైదిక మతములన్నీ శంకరాద్వైతముతో పర్యవసించినాయి. వారి తరువాత వేదాంత దర్శనమునకు ఎంతటి ఖ్యాతి వచ్చినదంటే శంకరులు ప్రతిష్టించిన ఈశ్వరాస్థిత్వము, భక్తినీ ప్రధానంగా గ్రహించి కొంత మార్పులు చేయబడిన సాంఖ్య, న్యాయదర్శనములు విశిష్టాద్వైతం, ద్వైతం పేరిట వేదాంత దర్శనముగా రూపొందాయి. శంకరుల తరువాత వచ్చిన భిన్న సిద్ధాంతములు ఆచార్యుల ప్రభావం అద్వైత సిద్ధాంతము మీద చెప్పుకోదగినంతగా లేదు.

శంకరులు వేదాంత దర్శనము మూడుగా విభజనమవడానికి కారకులైనారన్న విమర్శ సరికాదు. వారు ద్వైత విశిష్టాద్వైతములను అద్వైతమునకు విరోధములుగా పరిగణించలేదు. వారి ఉద్దేశ్యం ఏ మతమునూ ఖండించడం కాదు. అన్ని మతములనూ పరమతాత్పర్యమైన అద్వైతములో పర్యవసింప చేయడమే. వారు హైందవధర్మ సమగ్రతామూర్తి. జాతీయ సమైక్యతా స్పూర్తి.

ద్వైత, విశిష్టాద్వైత దర్శనములను సాకల్యంగా వివరించిన అప్పయ దీక్షితుల వారు తమ సిద్ధాంత లేశ సంగ్రహంలో ఇలా అంటారు.

నానాభాష్యాధృతాసా సగుణ ఫలగతిర్వైథ విద్యావిశేషైః

తత్తద్దేశప్తిరమ్యా సరిదివ సకలా యత్ర యత్యంశభూయం

తస్మిన్నానంద సింధావతి మహాతిఫలే భావ విశ్రాంతి ముద్రా

శాస్త్రస్యోద్ఘాటితాయైః ప్రణమతహృదితాన్‌ నిత్యమాచార్యపాదాన్‌ ||

వివిధ భాష్యములు (శ్రీకంఠ, రామానుజ, మాధ్వ, వల్లభ) సగుణోపాసనకు ఫలములైన కైలాస వైకుంఠాధిలోకములను చేర్చుతాయి. అవి ప్రసాదించే ఆనందం నదులు ప్రవహించడం వలన ఆయా ప్రదేశములకు కలిగే సస్యశ్యామలత వంటిది. శంకర భాష్యమన్న అన్ని నదులు తమను తాము సమర్పించుకొను పరమానంద ఘనమైన మహాసముద్రము వంటిది. అట్టి సత్యమును విశదబరచిన ఆచార్యపాదులకు మనసా నమస్కరిస్తున్నాను.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page